మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని చెప్పింది ఆయన కుమార్తె సునీతారెడ్డే అంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడటం దారుణమని ఏపీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. వివేకా హత్య ముమ్మాటికీ కడప ఎంపీ టికెట్ విషయంలోనే జరిగిందని ఆమె ఆరోపించారు. సునీత చంద్రబాబు కోసం ఆరాటపడుతున్నారని అనడం అన్యాయమన్నారు. డబ్బు, పలుకుబడి ఉందన్న అహంకారంతో ఈ కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. వివేకా చనిపోయిన రోజున 7 గంటల నుంచే తమకు అనుకూల మీడియాలో గుండెపోటు వార్తల్ని ప్రసారం చేశారన్నారు. హైదరాబాద్ లో ఉన్న తాను, సునీత ఈ వార్త చూసి షాక్ కు గురయ్యామని తెలిపారు. వివేకా హత్య కడప ఎంపీ టికెట్ కోసమే జరిగిందని, వివేకా తన ఇంటికే వచ్చి రెండు గంటల పాటు తనతో దీనిపైనే చర్చించారన్నారు. అవినాష్ కు టికెట్ కరెక్ట్ కాదని వివేకా చెప్పారని, జగన్ కూ ఈ విషయం చెప్పినా వినకుండా ఆయనకే టికెట్ ఇచ్చారన్నారు. అయినా మద్దతిచ్చిన వివేకా ఎప్పటికీ తనకు అడ్డేనని భావించి అవినాష్, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఈ హత్య చేయించారన్నారు. ప్రాణహాని ఉన్నప్పటికీ సునీత పోరాడుతుంటే, అన్నగా కనికరం లేకుండా జగన్ దుష్ప్రచారం చేయిస్తున్నారన్నారు.
