ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్ట్ హనుమాన్ ను ప్రారంభించింది. అటవీశాఖ రూపొందించిన హనుమాన్ ప్రాజెక్టుకి ఒక ప్రత్యేకత ఉంది. హనుమాన్ అంటే Healing And Nurturing Units for Monitoring, Aid & Nursing of Wildlife అనే లక్ష్యాలకు ప్రతీక అన్న మాట. ఈ ప్రాజెక్టులో భాగంగా అటవీ శాఖ మొత్తం 11 ప్రధాన అంశాలను అమలు చేయనుంది. వీటిలో ముఖ్యంగా అటవీ జంతువుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అత్యాధునిక రేడియో కాలర్ వ్యవస్థ, డ్రోన్ల వినియోగం మరియు మెరుగైన మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. జంతువులు జనావాసాల్లోకి రాకుండా అడ్డుకోవడానికి సౌర విద్యుత్ కంచెలు మరియు తుపాకీ శబ్దాలు చేసే సాంకేతికతను కూడా ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రకృతి సమతుల్యతను కాపాడటం మన బాధ్యత అని వివరించారు.